71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ సత్తా చాటింది. ఈ ఏడాది తెలుగు సినిమా కళాకారులకు మొత్తం ఏడు పురస్కారాలు దక్కాయి. హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అదే విధంగా, తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ రెండు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఇక ఇతర విభాగాల్లో కూడా తెలుగువారు సత్తా చాటారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: నీలం సాయి రాజేష్ (బేబీ), ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడు: పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్: నందు పృథ్వీ (హనుమాన్), ఉత్తమ బాల నటిగా: సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) ఈ పురస్కారాల నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో … “71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా పరిశ్రమకు పలు విభాగాల్లో గౌరవం దక్కడం ఎంతో సంతోషకరం. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం ఆనందదాయకం. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు శుభాకాంక్షలు. ‘హనుమాన్’ సినిమాకి ఉత్తమ వీఎఫ్ఎక్స్ అవార్డు దక్కడం హర్షణీయం. దర్శకుడు ప్రశాంత్ వర్మ, వీఎఫ్ఎక్స్ నిపుణులు, నిర్మాతలకు అభినందనలు. అలాగే ‘బేబీ’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రచయితగా నీలం సాయి రాజేష్, గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్, ‘బలగం’ సినిమాకి గీత రచయితగా కాసర్ల శ్యామ్, ‘హనుమాన్’కు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా నందు పృథ్వీ, ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకి బాలనటిగా సుకృతివేణి బండ్రెడ్డి అవార్డులు అందుకోవడం అభినందనీయం. ఈ గౌరవాలు తెలుగు సినిమా పరిశ్రమకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు జాతీయ పురస్కారాల విజేతలందరికీ సినీ, రాజకీయ, సామాజిక వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ హీరో, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్ప విషయం. బాలకృష్ణకి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు స్పందించారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. బాలకృష్ణ నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలకృష్ణకు, డైరెక్టర్ అనిల్ రావిపూడికి, చిత్ర బృందానికి అభినందనలు.. అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియాలో స్పందించారు. ఇక ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ ఎంపికయ్యారు. వారందరికీ కూడా పవన్ తన శుభాకాంక్షలు తెలిపారు.

- August 2, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor