‘ఓజీ’ థియేటర్‌లో మెగా హీరోల హంగామా..

‘ఓజీ’ థియేటర్‌లో మెగా హీరోల హంగామా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘ఓజీ’ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఈ సినిమా ఫీవర్‌ సినీ ప్రేమికులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఊపేసింది. ఈ సందర్భంగా మెగా కుటుంబ హీరోలు వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మామయ్య సినిమా చూడటానికి థియేట‌ర్‌కి వెళ్లారు. ఫ్యాన్స్ మధ్య కూర్చొని సినిమాని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ప్రీమియర్ షోకు వెళ్లిన‌ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ .. పవన్ ఎంట్రీ సీన్లలో ఫ్యాన్స్‌తో కలిసి పేపర్లు ఎగురవేస్తూ, కేరింతలు కొడుతూ మామూలు అభిమానుల్లా ఫుల్ ఎంజాయ్ చేశారు. థియేటర్‌లో వారు చేసిన హంగామా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ షోకి హాజరవడం విశేషం. అయితే మెగా హీరోల మాస్ మూమెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూస్తూ వారు చేసిన హ‌డావిడిని ఫ్యాన్స్ త‌మ కెమెరాల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మా హీరోలతో కలిసి సినిమా చూశాం” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ టేకింగ్, సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ముఖ్యంగా పవన్ ఎంట్రీ, పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు థియేటర్‌లు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ‘ఓజీ’ రికార్డుల దిశగా దూసుకెళ్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలిరోజు ఈ సినిమా వంద కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయం అని అంటున్నారు. పండ‌గ సెల‌వులు కూడా తోడ‌వ‌డంతో ప‌వ‌న్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ తెలిపారు.

editor

Related Articles