‘ఓజీ’ హిట్‌తో సుజీత్ జీవితమే మారింది..

‘ఓజీ’ హిట్‌తో సుజీత్ జీవితమే మారింది..

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూసిన ‘ఓజీ’ సినిమా గురువారం థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ప్రేక్షకులని అలరిస్తోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌ను ఇంత పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఎవరూ ప్రెజెంట్ చేయలేదని సినీవర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ విజయంతో డైరెక్టర్ సుజీత్ ఒక్కసారిగా సౌత్‌లో అగ్ర దర్శకుల సరసన చేరిపోయారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా సుజీత్‌కి సంబంధించిన అనేక విష‌యాలు ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సుజీత్ 1990 అక్టోబర్ 26న అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సినిమాలపై చిన్నప్పటి నుండే మక్కువ పెంచుకున్న ఆయన, ఎల్.వి. ప్రసాద్ ఫిలిం & టీవీ అకాడమీలో చదువుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరికతో ఉన్నప్పటికీ కెమెరా కొనడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో ఆయన తల్లి తన బంగారం తాకట్టు పెట్టి 44 వేల రూపాయలు తెచ్చి ఇచ్చింది. వాటితో సోనీ కెమెరా కొనిపెట్టింది. ఆ కెమెరా సుజీత్ జీవితాన్ని మార్చేసింది. సుజీత్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్‌లో మంచి స్పందన తెచ్చాయి. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌ని కలిసిన సుజీత్, తన షార్ట్ ఫిలిమ్స్ చూపించాడు. వాటిని చూసిన పూరి .. “నీకు అసిస్టెంట్‌గా పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వే సినిమా తీయగలవు” అని ప్రోత్సహించారు. ఆ మాటలు సుజీత్ కెరీర్‌కు బలమైన స్ఫూర్తినిచ్చాయి. యువి క్రియేషన్స్ కొత్త ట్యాలెంట్ కోసం చూస్తున్న సమయంలో, సుజీత్ వారికి రన్ రాజా రన్ కథ చెప్పాడు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయ్యింది.

editor

Related Articles