విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 (AK 47)’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను పరిచయం చేసిన చిత్రబృందం.. తాజాగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రను ప్రత్యేక వీడియోతో పరిచయం చేసింది. వీడియోలో వెంకటేష్ చెప్పిన ఫన్నీ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు” అంటూ ఆయన చెప్పే పంచ్‌లు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. స్వర్ణ పాత్ర ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆకట్టుకోనుంది. చిట్టిబాబు -స్వర్ణ దంపతుల మధ్య ఉండే అనుబంధం, సరదా సంభాషణలు, కుటుంబ విలువలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్, నారా రోహిత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ హాస్యంతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయని చిత్రబృందం తెలిపింది.

