హైదరాబాద్: ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు. ‘రావే చెలియా’ అంటూ సాగే ఈ మెలోడీ లవ్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రేమ భావాలను ఆహ్లాదకరంగా ఆవిష్కరించే ఈ గీతంలో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజువల్స్, సంగీతం, చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు కపిల్ కపిలన్ తన మధుర గాత్రంతో ఆలపించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన స్వరాలు పాటకు మరింత బలం చేకూర్చాయి. విడుదలైన కొద్ది సేపటికే ఈ సాంగ్‌కు మంచి వ్యూస్ రావడంతో పాటు సంగీత ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచగా, ఇప్పుడు ‘రావే చెలియా’ పాట కూడా ఆ అంచనాలను మరింత పెంచింది. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం కలగలిపిన కథతో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని రూపొందించినట్లు సమాచారం. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

