కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సోషియో- నేషనల్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్స్ & స్టూడియోస్ నిర్మిస్తోంది. టీజర్‌ను బట్టి చూస్తే, దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ, వ్యవసాయంలో రసాయనాలు, పురుగుమందుల అధిక వినియోగం వెనుక ఉన్న కుంభకోణాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. బాంబే హైకోర్టు నేపథ్యంలో సాగే కోర్ట్‌రూమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ శక్తివంతమైన న్యాయవాది పాత్రలో కనిపించనుండగా, శ్రేయాస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రి పాత్రను పోషిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
‘ది ఇండియా స్టోరీ’ సినిమా 2026 జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

