ఐవీఎఫ్ కష్టాలు చెప్పిన తేజస్విని

ఐవీఎఫ్ కష్టాలు చెప్పిన తేజస్విని

సినీ నటి తేజస్విని కొల్హాపురి తన మాతృత్వ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. గర్భం దాల్చేందుకు ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సను ఐదుసార్లు చేయించుకోవాల్సి వచ్చిందని, ఆ ప్రక్రియలో వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపారు.

ఐవీఎఫ్ చికిత్స శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎంతో సవాలుగా ఉంటుందని ఆమె చెప్పారు. ప్రతి దశలో క్లినిక్‌లకు వెళ్లి ఇంజెక్షన్లు తీసుకోవడం, చికిత్సను కొనసాగించడం చాలా కష్టమని పేర్కొన్నారు. రెండు సార్లు గర్భస్రావం కావడంతో తీవ్ర మానసిక వేదన అనుభవించినట్లు వెల్లడించారు.

చివరకు ఐదో ప్రయత్నంలో గర్భం దాల్చి తల్లి కావడం తన జీవితంలో ఎంతో ఆనందకరమైన ఘట్టమని చెప్పారు. ఆలస్యంగా కుటుంబాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, సాధ్యమైనంత వరకు 35 ఏళ్లలోపు సంతానం గురించి ఆలోచించడం మంచిదని మహిళలకు సూచించారు.

ఐవీఎఫ్ చికిత్స కారణంగా తన శరీరాకృతిలో కూడా మార్పులు వచ్చాయని తేజస్విని తెలిపారు. అయితే అన్ని కష్టాలను అధిగమించి తల్లి కావడం జీవితంలో అత్యంత విలువైన అనుభూతిగా నిలిచిందని అన్నారు. తేజస్విని, దర్శకుడు పంకజ్ సరస్వత్ దంపతులకు 2015లో కుమార్తె వేదిక జన్మించింది. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత వారికి సంతానం కలిగింది.

Related Articles