తమిళనాడు రాష్ట్రంలో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టోడియల్ డెత్ సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుండి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయమని అన్నారు. నిరసన కార్యక్రమంలో నటుడు విజయ్ నల్ల చొక్కా ధరించారు. చేతిలో ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అని రాసిపెట్టి ఉన్న ప్లకార్డును పట్టుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీవీకే శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి ఎక్కువగా సారీ అనే సమాధానమే వినిపిస్తోందని విమర్శించారు. అన్నా యూనివర్సిటీ కేసు నుండి అజిత్ కుమార్ కేసు వరకు డీఎంకే పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ప్రశ్నించారు. కోర్టులే జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వంతో పనేముంది, ముఖ్యమంత్రితో అవసరం ఏముందని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు అజిత్ కుమార్ పేద కుటుంబం నుండి వచ్చిన యువకుడని, ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారని అన్నారు. డీఎంకే పాలనలో ఇప్పటివరకు 24 మంది కస్టడీలో మరణించారని, వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారిస్తోంది.
- July 14, 2025
0
106
Less than a minute
Tags:
You can share this post!
editor

