తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 విజేతలను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డులను ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న ఘనంగా నిర్వహించనున్నారు. ఈసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి లభించింది. పైడి జైరాజ్ అవార్డు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు, బీఎన్ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు దక్కాయి. ఏయన్నార్ అవార్డు సీనియర్ నటి జయసుధకు, సి.నారాయణరెడ్డి అవార్డు గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు లభించాయి.
2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయ్’, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న నిలిచారు. ఈ ఏడాది కూడా చిన్న చిత్రాలకు ఎక్కువ అవార్డులు దక్కడం ప్రత్యేకతగా నిలిచింది.


