షూటింగ్‌లలో  పాల్గొనకండి,  ఆపేయండి

షూటింగ్‌లలో  పాల్గొనకండి,  ఆపేయండి

సినీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. నిన్న జరిగిన కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో ఇరువర్గాల ప్రతిపాదనలపై చర్చించారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఫెడరేషన్‌ సభ్యులు ఆశాభావం వెలిబుచ్చారు. గురువారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఛాంబర్‌ అనుమతి లేకుండా స్టూడియోలు, ఔట్‌ డోర్‌ యూనిట్‌లు ఎలాంటి షూటింగ్‌లకు సహకరించకూడదని ఆదేశించింది. మరోవైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఫెడరేషన్‌ నాయకులపై కేసులు వేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ పరిణామాలపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ తాజా పరిణామాల పూర్వాపరాల విషయానికొస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్ల వారు ఏకపక్ష సమ్మెకు పిలుపునివ్వడం.. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీవ్రంగా పరిగణించింది. ఫెడరేషన్‌ సభ్యులతో చర్చలు లేదా సంప్రదింపులు చేయరాదని తాజా ప్రకటన ద్వారా ఛాంబర్‌ సభ్యులకు టీఎఫ్‌సీసీ హుకూం జారీ చేసింది. స్టూడియోలు, ఔట్‌డోర్‌ యూనిట్లు, మౌళిక వసతుల యూనిట్‌ సభ్యులు టీఎఫ్‌సీసీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఛాంబర్‌ అనుమతి లేకుండా చిత్ర నిర్మాణాలకి సంబంధించిన ఎలాంటి సేవలూ అందించకూడదని కఠినమైన ఆదేశాలను టీఎఫ్‌సీసీ జారీచేసింది. ఛాంబర్‌ ప్రకటన ఒక్కసారిగా ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ని షాక్‌కి గురిచేసింది. గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్టు.. మరోవైపు ఫెడరేషన్‌ సభ్యులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కోర్టులో కేసులు వేశారు. ఫెడరేషన్‌ సమ్మె కారణంగా తమకు రోజుకి కోటిన్నర నష్టం వాటిల్లిందంటూ నిర్మాత విశ్వప్రసాద్‌ కోర్టుకెక్కారు. ఊహించని ఈ పరిణామాలతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. రెండురోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్న తరుణంలో ఈ వివాదం ఇలా అనుకోని మలుపులు తీసుకోవడంతో నిర్మాణంలో ఉన్న సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఓ వైపు ఫిల్మ్‌ ఛాంబర్‌, మరోవైపు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోందని, ఇది పరిశ్రమకు నష్టదాయకమన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

editor

Related Articles