కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వివాహంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారానికి తాజాగా తమిళ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనిరుధ్ ఎంతో మృదుస్వభావి, ప్రతిభావంతుడని కొనియాడారు. ప్రస్తుతం ఏదో కారణంతో వివాహం ఆలస్యమవుతున్నా, త్వరలోనే అతను పెళ్లి చేసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను విన్న సమాచారం మేరకే మాట్లాడుతున్నప్పటికీ, అనిరుధ్ – కావ్య వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీరిద్దరూ మంచి జంటగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.
కావ్య మారన్ గురించి మాట్లాడుతూ, ఆమెను సమర్థవంతమైన వ్యాపారవేత్తగా ప్రశంసించారు. తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని స్పోర్ట్స్ ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు. గతంలో ఓటీటీ ప్రాజెక్ట్ విషయంలో ఆమెను కలిసిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, కథలు నచ్చి ఒకేసారి ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. చివరగా, అనిరుధ్ సంగీత రంగంలో, కావ్య వ్యాపార రంగంలో రాణిస్తున్నారని, భవిష్యత్తులో ఇద్దరూ కలిసి “మ్యూజికల్ బిజినెస్” కూడా చేయొచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాహ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ లేదా కావ్య మారన్ అధికారికంగా స్పందించలేదు.

