సంగీత ప్రపంచానికి తీరని లోటు.. జమునారాణి మృతి

సంగీత ప్రపంచానికి తీరని లోటు.. జమునారాణి మృతి

దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కె. జమునారాణి (88) కన్నుమూశారు. వృద్ధాప్య, వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి, కేవలం ఏడేళ్ల వయసులోనే ‘త్యాగయ్య’ (1946) సినిమాతో గాయనిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో 6 వేలకు పైగా పాటలు ఆలపించి దక్షిణాది సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు.

‘దేవదాసు’, ‘అలీబాబా 40 దొంగలు’, ‘చంద్రాణి’, ‘లైలా మజ్ను’, ‘అన్నా తమ్ముడు’ వంటి అనేక సినిమాల్లో ఆమె ఆలపించిన పాటలు విశేష ఆదరణ పొందాయి. జానపదం, మెలోడీ, భక్తి గీతాలు, యుగళగీతాల్లో తనదైన శైలితో శ్రోతలను అలరించారు. సింహళ సినిమాల్లోనూ అత్యధిక పాటలు పాడిన భారతీయ గాయనిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జమునారాణి మృతిపై సినీ, సంగీత రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతికంగా దూరమైనా, తన చిరస్మరణీయ గీతాల ద్వారా సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నివాళులర్పించారు.

Related Articles