అలియాభ‌ట్ మాజీ అసిస్టెంట్ అరెస్టు..

అలియాభ‌ట్ మాజీ అసిస్టెంట్ అరెస్టు..

అలియా భ‌ట్‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ వేదికా ప్ర‌కాశ్ శెట్టిని చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఆమె సొమ్ము 77 ల‌క్షలు కాజేసిన‌ట్లు తేలింది. 2021 నుంచి 2024 వ‌ర‌కు అలియాభ‌ట్‌కు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా వేదికా శెట్టి ప‌నిచేసింది. ఆ కేసులో వేదికా ప్ర‌కాశ్ శెట్టిని అరెస్టు చేశారు. అలియాకు చెందిన ప్రొడ‌క్ష‌న్‌ ఆఫీస్ కంపెనీతో పాటు ప‌ర్స‌న‌ల్ అకౌంట్ల నుండి ఆ మొత్తాన్ని కాజేసిన‌ట్లు తెలుస్తోంది. మే 2022 నుండి ఆగ‌స్టు 2024 మ‌ధ్య‌లో ఈ నేరం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అలియా త‌ల్లి, ఆర్ట్ డైరెక్ట‌ర్ సోని ర‌జ్దాన్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. జ‌న‌వ‌రి 23వ తేదీన జూహూ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు అయ్యింది. చీటింగ్ కేసు న‌మోదు అయిన త‌ర్వాత వేదికా శెట్టిని అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో హీరోయిన్ అలియాకు చెందిన ఫైనాన్షియ‌ల్ డాక్యుమెంట్లు, పేమెంట్లు, షెడ్యూల్ ప్లానింగ్ చూసుకునేది. న‌కిలీ బిల్లులు సృష్టించి అలియాభ‌ట్ సంత‌కం తీసుకుని డ‌బ్బును లూటీ చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో తేల్చారు. ట్రావెల్‌, మీటింగ్‌లు, ఇత‌ర నిర్వ‌హ‌ణ కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పేద‌ని పోలీసులు వెల్ల‌డించారు. అలియా సంత‌కం చేసిన త‌ర్వాత ఆ అమౌంట్ త‌న స్నేహితురాలికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేద‌ని, ఆ త‌ర్వాత మ‌ళ్లీ వేదికా శెట్టి అకౌంట్‌లోకి ఆ డ‌బ్బు వెళ్లేద‌ని పోలీసులు తేల్చారు. అలియా త‌ల్లి ఫిర్యాదు చేసిన త‌ర్వాత‌.. వేదికా శెట్టి ప‌రారీలో ఉంది. రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, పుణె, బెంగుళూరులలో తిరిగింది. అయితే బెంగుళూరులో ఆమెను జూహూ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

editor

Related Articles