వరద బాధితులకు కార్తీక్ భారీ విరాళం

వరద బాధితులకు కార్తీక్ భారీ విరాళం

భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అస్సాం ప్రజలకు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ అండగా నిలిచారు. వరద సహాయ చర్యల కోసం ఆయన రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించగా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నటుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం హిమంత బిశ్వ శర్మ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, క్లిష్ట సమయంలో కార్తీక్ ఆర్యన్ అందించిన ఈ ఉదార సహాయం బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవను అభినందించారు. అంతకుముందు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తన ‘బీయింగ్ హ్యూమన్’ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు సహాయం ప్రకటించారు.

ఇదిలా ఉండగా, అస్సాంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) ప్రకారం, ఈ ఏడాది వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. శివసాగర్, చరైదేవ్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం 3 లక్షల మందికి పైగా ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుండగా, 551 గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది హెక్టార్లలో పంటలు కూడా దెబ్బతిన్నాయి. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది.

Related Articles