భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. నేడు గ్రాండ్‌గా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, అంతర్జాతీయ విడుదల ప్రణాళికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచే ఈ సినిమా, హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో రూపొందుతోందని పేర్కొన్నారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

