ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రాకా’పై మరో ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా నాలుగు గెటప్స్‌లో ఆయన నటించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట ఈ పాత్రలకు వేర్వేరు నటులను తీసుకోవాలని భావించినప్పటికీ, అన్ని పాత్రలను తానే చేయాలని అల్లు అర్జున్ సూచించినట్లు టాక్. లుక్ టెస్ట్స్లో ఆయన చూపించిన వేరియేషన్స్‌తో ఆకట్టుకున్న అట్లీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ‘అదిరింది’, ‘విజిల్’, ‘జవాన్’ సినిమాల్లో మల్టిపుల్ రోల్స్‌ను విజయవంతంగా చూపించిన అట్లీ, ఇప్పుడు ‘రాకా’లో కూడా అదే తరహా ప్రయోగం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇది నిజమైతే అల్లు అర్జున్ కెరీర్లోనే తొలి మల్టిపుల్ రోల్ సినిమా అవుతుంది. దీంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె ఇప్పటికే హీరోయిన్గా అధికారికంగా ఖరారైంది. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఫెమినా జార్జ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరి ఎంపికపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘రాకా’కు సంబంధించిన ఈ ప్రచారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

