పంజాబీ స్టార్ దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ సినిమా విడుదలైన రెండు రోజులకే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చర్య వెనుక కారణాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి. అధికారిక సమాచారం ప్రకారం, ఐటీ రూల్స్- 2021 (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) ప్రకారం దేశ భద్రత, బాధ్యతాయుత డిజిటల్ కంటెంట్ అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను అందుబాటులో లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సూచించిన మార్పులు, కట్స్‌ను పాటించకుండా, కొత్త టైటిల్‌తో నేరుగా ఓటీటీలో విడుదల చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా రూపొందింది. తొలుత ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 127 కట్స్ సూచించడంతో పాటు టైటిల్ మార్చాలని కోరింది. అనంతరం చిత్రబృందం ‘సత్లుజ్’ పేరుతో నేరుగా ఓటీటీలో విడుదల చేసింది.
మరోవైపు, సినిమా తొలగింపుపై పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు, ఎస్జీపీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. హీరో దిల్జీత్ దోసాంజ్ కూడా ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరగా, నిబంధనలను పాటించి మళ్లీ విడుదల చేసుకోవచ్చని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.

