తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు అరుదైన సాహసానికి సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాలో ఏకంగా 11 పాత్రలు పోషిస్తూ కొత్త రికార్డు సృష్టించనున్నారు. గతంలో శివాజీ గణేషన్ ‘నవరాత్రి’లో తొమ్మిది, కమల్ హాసన్ ‘దశావతారం’లో పది పాత్రల్లో నటించగా, ఇప్పుడు యోగిబాబు ఆ రికార్డును అధిగమించనున్నారు.
ఈ సినిమాకి ఆర్. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, 9 లైట్స్ బ్యానర్‌పై సురేష్ ముత్తు నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తికాగా, మలయాళ నటి అతిథి రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగనుంది. ఇందులో యోగిబాబు హీరో, విలన్, కమెడియన్‌తో పాటు కవలల పాత్రల్లో కూడా కనిపించనున్నారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదం, దాని బ్లాక్‌బాక్స్ చుట్టూ తిరిగే కథలో హీరో ఎదుర్కొనే సవాళ్లను వినోదాత్మకంగా చూపించనున్నట్లు దర్శకుడు తెలిపారు. రెండో షెడ్యూల్ చిత్రీకరణను ఇంగ్లాండ్, కెన్యాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రెడిన్ కింగ్స్‌లీ, వీటీవీ గణేశ్, పంజు సుబ్బు, ఏ. వెంకటేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

