ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు భుజాలకు శస్త్రచికిత్స అవసరమని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు సూచించిన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ భావోద్వేగంగా స్పందించారు. గత 15 ఏళ్లుగా పవన్ నడుము, భుజం నొప్పిని భరిస్తూ పనిచేయడం తనను కలచివేసిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘గబ్బర్ సింగ్’ షూటింగ్ సమయంలో గుజరాత్లో గుర్రంపై నుంచి పడిపోవడంతో పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయని, అప్పుడే వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారని బండ్ల గణేష్ గుర్తు చేశారు. అయినప్పటికీ నిర్మాతకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో పవన్ ఆపరేషన్‌ను వాయిదా వేసి, ముందుగా సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలిపారు.
‘‘ప్రొడ్యూసర్‌కు ఇబ్బంది కలగకూడదు, వందల మంది కష్టపడుతున్నారు’’ అని భావించి సినిమా పూర్తయ్యే వరకు బాధను భరిస్తూ పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ఒక నిర్మాతగా తనకు పవన్ ఇచ్చింది కేవలం హిట్ సినిమా మాత్రమే కాదని, జీవితాంతం మరచిపోలేని రుణమని అన్నారు.
ఇకపై పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని బండ్ల గణేష్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

