‘వారణాసి’ షూటింగ్ విశేషాలు చెప్పిన పృథ్వీరాజ్

‘వారణాసి’ షూటింగ్ విశేషాలు చెప్పిన పృథ్వీరాజ్

మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప దర్శకుడే కాకుండా అద్భుత నటుడని అన్నారు.

సెట్స్‌లో ఒక సన్నివేశాన్ని వివరించే సమయంలో రాజమౌళి పూర్తిగా ఆ పాత్రలో లీనమై, అవసరమైన భావోద్వేగాలను స్వయంగా నటించి చూపిస్తారని పృథ్వీరాజ్ తెలిపారు. దీంతో నటీనటులకు సన్నివేశం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు.

కొన్ని సందర్భాల్లో రాజమౌళి విజన్‌ను అర్థం చేసుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అయితే చివరికి ఎడిటింగ్ టేబుల్‌పై ఫలితం చూసినప్పుడు ఆయన ఆలోచనల గొప్పతనం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆయనతో పనిచేయడం ద్వారా నటుడిగా, దర్శకుడిగా, వ్యక్తిగా ఎంతో నేర్చుకున్నానని అన్నారు.

రాజమౌళి పనితీరు గురించి మాట్లాడుతూ, ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే ఆయన 5:15కే సెట్స్‌కు చేరుకుని రిహార్సల్స్ పూర్తి చేస్తారని చెప్పారు. లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే ఉంటుందని వెల్లడించారు.

ప్రతి సినిమాను తొలి అవకాశంలా భావించి రాజమౌళి కష్టపడతారని, ఒక సన్నివేశం కోసం 90 టేక్స్‌ వరకు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయని పృథ్వీరాజ్ వెల్లడించారు.

Related Articles