‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎల్367’ (వర్కింగ్ టైటిల్)లో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రానికి విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సేతో చిత్రబృందం చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, భాగ్యశ్రీకి ఇది తొలి మలయాళ చిత్రం కానుంది. వచ్చే నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్ వంటి అగ్రహీరోతో కలిసి నటించే అవకాశం రావడం భాగ్యశ్రీ కెరీర్‌కు మరో కీలక మైలురాయిగా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

