ప్రఖ్యాత దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో విడుదలైన ‘16 వయథినిలే’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా, తమిళ చిత్రసీమలో కొత్త తరహా కథనాలకు నాంది పలికారు. గ్రామీణ జీవన విధానం, ప్రేమ, మానవ సంబంధాలను సహజత్వంతో తెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగులో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘కొత్త జీవితాలు’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాధ, రాధిక, రేవతి, కార్తీక్ వంటి అనేక మంది నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం ఆయన సినీ సేవలను గుర్తించి 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ చిత్రంలో నటుడిగా కనిపించారు. భారతీరాజా మరణంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
- June 10, 2026
0
95
Less than a minute
You can share this post!
editor

