షారూఖ్‌కి తొలిసారి జాతీయ అవార్డ్

షారూఖ్‌కి తొలిసారి జాతీయ అవార్డ్

బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్‌ని ఆయన అభిమానులు ప్రేమగా “కింగ్ ఖాన్” అని పిలుస్తారు. 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో జన్మించిన షారుఖ్‌ తన కెరియర్‌ను 1980లలో టీవీ సీరియల్స్‌తో ప్రారంభించారు. 1992లో ‘దీవానా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, వెంటనే ‘బాజీగర్’, ‘డర్’ వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కానీ 1995లో వచ్చిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా మాత్రం ఆయన కెరియర్‌ను మలుపుతిప్పింది. అప్పటి నుండి అమ్మాయిల కలల రాకుమారుడిగా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. షారూఖ్ త‌న కెరియ‌ర్‌లో ‘స్వదేశ్’, ‘చక్‌దే ఇండియా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘దేవదాస్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. నటనలో ప్రేమ, ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, బాధ.. అన్నీ ఆవిష్కరించగలిగే నటుడిగా పేరు పొందారు. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. ఓ సందర్భంలో షారూఖ్ మాట్లాడుతూ.. నేను చనిపోయే వరకు సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సెట్‌లో యాక్షన్ అనగానే మరణించాలి. వాళ్లు కట్ అనకముందే నా జీవితం ముగిసిపోవాలి. అదే నా చివరి కోరిక అని అన్నారు. ఈ ప్రేమే ఆయన్ని బాలీవుడ్‌లో అగ్రహీరోగా నిలబెట్టింది. ఇప్పటివరకు ఆయన 100కి పైగా సినిమాల్లో నటించి, 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ సహా ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో, షారుఖ్ ఖాన్ త‌న‌ కలను నెరవేర్చుకున్నారు. ‘జవాన్’ సినిమాలో చేసిన అద్భుతమైన ద్విపాత్రాభినయంకి గాను ఆయ‌న‌ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే త‌న‌ని ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక చేసినందుకు షారూఖ్ ఖాన్ భార‌త సర్కారుకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

editor

Related Articles