టాలీవుడ్‌లో నెపోటిజం అంశంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన వై. రవిశంకర్ తాజాగా సినీ పరిశ్రమలో విజయానికి వారసత్వం కంటే ప్రతిభే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, హీరో రిత్విక్‌ను ఉద్దేశించి మాట్లాడారు. సినీ రంగంలోకి ఎవరైనా గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో రావొచ్చని, కానీ చివరకు నిలబెట్టేది మాత్రం టాలెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు.
బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన విజయాలు సాధించలేరని, కష్టపడి సొంత ప్రతిభను నిరూపించుకున్నవారే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగుతారని రవిశంకర్ పేర్కొన్నారు. మన వెనుక ఎలాంటి అండ లేదనే భావనతో కష్టపడితేనే నిజమైన విజయం సాధించగలమని ఆయన అన్నారు. హీరో రిత్విక్ కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రస్తుతం వై. రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ పరిశ్రమలో నెపోటిజంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, నరేష్, వైశాఖ ధీమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రాజా ది రాజా’ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

