‘లెనిన్’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి ఆర్థిక కష్టాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పారు. తాను పుట్టిన కొద్ది రోజులకే తన తండ్రి ఉద్యోగం కోల్పోయారని, దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. “మా నాన్న ఒకరి దగ్గర ‘దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు’ అని ప్రాధేయపడటం నాకు తెలుసు. ఆ సంఘటన నాపై ఎంతో ప్రభావితమైంది. కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలనే సంకల్పం అప్పుడే వచ్చింది” అని భాగ్యశ్రీ చెప్పారు.
ఇటీవల జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో కూడా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయానికి ఎంతో కష్టపడ్డానని, తనను ఎప్పుడూ ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే ‘చందు ఛాంపియన్’, ‘యారియాన్ 2’ సినిమాలతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’, రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాల్లో నటించారు. అలాగే దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’ సినిమాలో నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా ‘లెనిన్’ విజయంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

