‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ తనపై వైరల్ అవుతున్న డెలివరీ బాయ్ వివాదంపై స్పందించారు. తాను ఎవరినీ కావాలని కొట్టలేదని, తల్లితో అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఆవేశానికి గురయ్యానని స్పష్టం చేశారు.
అఖిల్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, తమ ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయకపోయినా ఓ పార్శిల్ వచ్చింది. విషయం తెలుసుకునేందుకు తన తల్లి డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా, అతడు దురుసుగా, అసభ్యంగా మాట్లాడాడని ఆరోపించారు. ఈ విషయం తెలిసి తాను మర్యాదగా మాట్లాడాలని చెప్పానని, అయితే డెలివరీ బాయ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని అన్నారు.
తాను కూడా గతంలో డెలివరీ బాయ్‌గా పనిచేశానని, ఆ ఉద్యోగం విలువ తనకు తెలుసని అఖిల్ పేర్కొన్నారు. అడ్రస్ పొరపాటుతో ఇంతకుముందు కూడా పలుమార్లు తమ ఇంటికి ఇతరుల పార్శిళ్లు వచ్చాయని చెప్పారు. తల్లిని అవమానించడాన్ని భరించలేక ఆవేశంతో స్పందించానని, అయితే ఒక నటుడిగా మరింత సంయమనం పాటించి పోలీసులను ఆశ్రయించి ఉండాల్సిందని అంగీకరించారు. అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదని, జరిగిన ఘటనను వివరించేందుకే ఈ వివరణ ఇస్తున్నానని అఖిల్ రాజ్ తెలిపారు.

