యువ నటి కయాదు లోహర్ తన స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదో తరగతి చదువుతున్న సమయంలో ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లే దారిలో కొందరు యువకులు ప్రతిరోజూ తనను వేధించేవారని ఆమె తెలిపారు. మొదటి రెండు రోజులు వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోయానని, కానీ మూడో రోజు సహనం కోల్పోయి రోడ్డుపై ఉన్న రాయిని తీసుకుని వారి వైపు విసిరినట్లు చెప్పారు.
ఆ రాయి ఒక యువకుడి తలకు తగలడంతో అతడికి గాయమై రక్తస్రావం జరిగిందని, అనంతరం తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని కయాదు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కోపం, భయం, నిస్సహాయత కలిసి తనను అలా స్పందించేలా చేశాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఘటనను గుర్తు చేసుకుంటే ఎవరినైనా గాయపరచడం సరైన మార్గం కాదని, హింస ఎప్పుడూ పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు.
సాధారణంగా తాను ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తినని, కానీ వేధింపులను మౌనంగా భరించడం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు. కయాదు వ్యాఖ్యలతో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొనే వేధింపుల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆమె పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

